బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించబోతున్న మూవీలో సోనాక్షి సిన్హా నటించబోతోందని బీ టౌన్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ‘హీరా మండి’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఇందిలో ఇప్పటికే హ్యుమా ఖురేషి ఓ పాత్రకు ఎంపికచేశారు. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘పాకీజా’ ప్రేరణతో భన్సాలీ ‘హీరా మండి’ని తెరకెక్కించనున్నారు. హిందీలో స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్, మీనా కుమారి లాంటి వారు ‘పాకీజా’, ‘ఉమ్రావ్ జాన్’, ‘దేవదాస్’ వంటి సినిమాలలో నర్తకీమణులుగా, వేశ్యలుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు హ్యుమా ఖురేషి, సోనాక్షి సిన్హా ఈ తరహా పాత్రల్లో అలరించడానికి సిద్దమవుతున్నారు. ఇక ‘హీరా మండి’ సినిమాలో భన్సాలీ ముజ్రా సంస్కృతిని చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇంతకముందు భన్సాలీ నిర్మాణంలో వచ్చిన ‘రౌడీ రాథోర్’ మూవీలో సోనాక్షి నటించింది. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో నటించబోతుండటం ఆసక్తికరం.