అఖిల్ హీరోగా రూపొందిన రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన లెనిన్ బ్లాక్‌బస్టర్ వైభవం ఈవెంట్లో నాగార్జున మాట్లాడారు. ఈ సినిమా విషయంలో రైటర్ సత్యానంద్‌గారికి, మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్కీ థ్యాంక్స్ చెప్పాలి. సత్యానంద్ కథ విని ఓకే చేశారు. మా అన్నపూర్ణ పోస్ట్‌ప్రొడక్షన్ టీమ్ సినిమాకు అద్భుతమైన క్వాలిటీ తెచ్చారు. ఇక ఈ సినిమాకు అందరూ ప్రేమించి పనిచేశారు. ఆడియన్స్ కూడా ప్రేమించి చూస్తున్నారు. ఈ ప్రేమ కోసమే అఖిల్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. మీకెలా ఉందో తెలీదు కానీ, నాకూ, చైతూకీ, అఖిల్‌కి పండుగలా ఉంది అని పేర్కొన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ తమ్ముడు అఖిల్ లేట్‌గా వచ్చినా తనకు ప్రేక్షకులు లేటెస్ట్గా సపోర్ట్ చేశారు. ఈ కథ ఒప్పుకున్నప్పుడే అఖిల్ హీరో అయ్యాడు. కథ విన్నాక నటుడిగా నాకే భయమేసింది. అనుభవం ఉన్న నటులు మాత్రమే చేయగలిగిన పాత్ర ఇది. అలాంటి పాత్రను అద్భుతంగా చేశాడు అఖిల్. అతని నటన చూసి అన్నగా గర్వించా. లెనిన్ కథ వినగానే, ఇది పెద్ద కథ. కష్టమైన పాత్ర. కాంప్లెక్స్ లవ్‌స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు అఖిల్‌కి ఇది కరెక్టా? అని నాన్నని అడిగా. కానీ నాన్న నేను చేయిస్తా అన్నారు. ఇది నాన్న తీసుకున్న డేరింగ్ స్టెప్. దర్శకుడు నందు అద్భుతంగా సినిమా తీశాడు. ఇది నిజమైన విజయోత్సవం. నా బేబీ సిసింద్రీకి పెద్ద విజయాన్నిచ్చినందుకు ప్రేక్షకదేవుళ్లకు ధన్యవాదాలు అన్నారు. మూడో రోజే బ్రేక్ ఈవెన్ అయ్యిందంటూ అఖిల్ ఆనందం వెలిబుచ్చారు. థియేటర్లు పెంచి సినిమాకు మంచి వసూళ్లు రావడానికి కారకులైన డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు.





























