Skip to main content

Namaste NRI

మెటాకు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్ధారించిన న్యూ మెక్సికో కోర్టు, కంపెనీకి 567 మిలియన్ డాల‌ర్ల‌ (సుమారు రూ. 5,400 కోట్లకు పైగా) జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా రెండో దశలో జడ్జి బ్రయాన్ బీడ్‌షీడ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. తీర్పు ప్రకారం జరిమానా మొత్తంలో 420 మిలియన్ డాల‌ర్లు సోషల్ మీడియా వల్ల ప్రభావితమైన యువతకు చికిత్సా సేవల కోసం కేటాయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మిగిలిన నిధులను రాబోయే ఐదేళ్లలో అవగాహన, నివారణ కార్యక్రమాలు, స్క్రీనింగ్ సేవలు, ఇతర సంబంధిత ఖర్చుల కోసం వినియోగించాలని ఆదేశించింది.

ఈ కేసులో గత మార్చి నెలలో వెలువడిన తీర్పునకు ఇది కొనసాగింపు కావడం గమనార్హం. ఆ సమయంలో మెటా ఉద్దేశపూర్వకంగానే పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించిందని, లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిందని నిర్ధారించిన జ్యూరీ, కంపెనీకి 375 మిలియన్ డాల‌ర్ల సివిల్ పెనాల్టీ విధించింది. ఈ కేసు విచారణలో ప్రాసిక్యూటర్లు మెటా ప్లాట్‌ఫామ్‌లలో కీలక మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా యువతను వ్యసనపరులుగా మార్చే ఫీచర్లను నియంత్రించాలని, వయసు నిర్ధారణ పద్ధతులను కఠినతరం చేయాలని, పిల్లల లైంగిక దోపిడీని అరికట్టేందుకు డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగులను మెరుగుపరచాలని వాదించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events