అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, ఇతర తాత్కాలిక విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దయ్యే అవకాశం ఉన్నది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులు తక్షణమే అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) మినహాయింపు ఇస్తే తప్ప, వారు అమెరికాలో ఉంటూ తమ వీసా హోదాను లేదా ఉద్యోగ యజమానిని మార్చుకోవడం సాధ్యపడదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉన్నది. ఈ సమీక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిని ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురిస్తుంది. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు 30 నుంచి 60 రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు.

ఈ నిబంధన అమల్లోకి వస్తే, వీసా గడువు ముగిసేలోపే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు చట్టబద్ధమైన హోదాలో లేనట్టే భావిస్తారు. దీనివల్ల వారు వెంటనే అమెరికాను విడిచి వెళ్లాల్సి వస్తుంది. యూఎస్‌సీఐఎస్ తన ప్రత్యేక అధికారంతో మినహాయింపు ఇస్తే తప్ప వారు దేశంలోనే ఉంటూ కొత్త ఉద్యోగంలో చేరడం లేదా వేరే వీసా క్యాటగిరీకి మారడం కుదరదు.





























