అమెరికా ప్రపంచంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటారు. అలాంటి అగ్ర రాజ్యంలోనూ కొన్ని చీకటి కోణాలున్నాయి. ఇప్పటికీ ఆ దేశంలోని 32 రాష్ర్టాల్లో బాల్య వివాహాలను చట్టాలు అనుమతిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రం బాల్య వివాహాలను రద్దు చేసింది. ఇక నుంచి పెళ్లి చేసుకునే ఇద్దరికీ 18 ఏండ్లు నిండాలి. 2027 జనవరి 1 నుంచి ఈ చట్టం కాలిఫోర్నియాలో అమల్లోకిరానుంది. ఈ చట్టంపై సంతకం చేసిన కార్యక్రమంలో కోర్ట్నీ స్టోడెడ్ కూడా పాల్గొన్నారు.

ఆమె 16 ఏండ్ల వయసులోనే 51 ఏండ్ల డగ్ హచిసన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి గుర్తింపు పొందారు. అయితే అమెరికాలోని 50 రాష్ర్టాలకు గాను ఇప్పటికి 18 రాష్ర్టాల్లోనే ఈ బాల్య వివాహాల నిషేధిత చట్టం అమల్లో ఉంది. మిగతా 32 రాష్ర్టాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో బాల్య వివాహాలను చట్టాలే అనుమతిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య అమెరికాలో 2 లక్షల 60వేల మంది బాల్య వివాహాలు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.















