పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులకు అంతులేనంత సంతోషాన్నిస్తున్నారు కథానాయకుడు ప్రభాస్. 24ఏండ్ల క్రితం ఈశ్వర్ తో మొదలైన ఆయన సినీ ప్రయాణం దేశం గర్వపడే బాక్సాఫీస్ రికార్డులతో అప్రతిహతంగా సాగుతున్నది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మాను ఇష్టపడేవారు నార్త్‌లో కోకొల్లలు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్థానిక స్టార్ హీరోల సినిమాలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడుతున్నాయి. దీన్నిబట్టి హీరోగా ఆయన ఇమేజ్ ఈ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ నటించిన బాహుబలి-ది కంక్లూజన్, కల్కి 2898ఏడీ చిత్రాలు వెయ్యికోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. వెయ్యికోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన రెండు సినిమాలున్న ఏకైక దక్షిణాది హీరో ప్రభాస్ మాత్రమే.

ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా ఎల్లలు దాటి, గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీటిలో ఫౌజీ వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానున్నట్టు వినికిడి. నేడు ప్రభాస్ పుట్టిన రోజు. ఆయన అభిమానులకు నిజంగా ఇది పండుగ రోజే.















