వినియోగదారుల డేటా గోప్యత విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిందన్న కేసులో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌పై అమెరికాలోని న్యూ మెక్సికో న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. సంస్థకు 25 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.2 లక్షల కోట్లు) రికార్డు స్థాయి జరిమానా విధిస్తూ జడ్జి ఫ్రాన్సిస్ మాథ్యూ ఆదేశాలు జారీ చేశారు.

2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా సమారు 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలను సేకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వినియోగదారుల సమాచారాన్ని ఎవరెవరు యాక్సెస్ చేయవచ్చనే వాస్తవాలను దాచిపెట్టి, ప్రజలను మెటా తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపిస్తూ న్యూ మెక్సికో అటార్నీ జనరల్ 2021లో ఈ దావా వేశారు.

గత సెప్టెంబర్‌లో ఈ కేసును విచారించిన న్యాయ నిర్ణేతల బృందం మెటా యాజమాన్యం డాటా ప్రైవసీ, భద్రత తదితర అంశాలపై చేసిన 29 బహిరంగ ప్రకటనల్లో 26 ప్రకటనలు పచ్చి అబద్ధాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నిర్ధారించింది. న్యూ మెక్సికో వినియోగదారుల పరిరక్షణ చట్టాల పరిధిలో మెటా దాదాపు 4.3 కోట్లకు పైగా ఉల్లంఘనలకు పాల్పడిందని జ్యూరీ తేల్చింది. మెక్సికో చట్టాల ప్రకారం మెటాకు 219 బిలియన్ల డాలర్లకు పైగా జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయమూర్తి ఆ మొత్తాన్ని 25 బిలియన్ డాలర్లకు పరిమితం చేశారు.















