హెచ్-1బీ వీసాల జారీ విషయంలో లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను అమలు చేయనున్నట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది. హెచ్-1బీ వీసాల ఆధారంగానే ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తుంటాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్ 1బీ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై అమెరికాకు చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు వేతనం ఆధారంగా వర్క్ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది. దీంతో లాటరీ విధానమే కొనసాగనుంది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్ 1 బీ వీసాలను జారీ చేస్తోంది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్ 1 బీ వీసాలను జారీ చేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది.