మొదలు కొందరి పేర్లు బయటికొచ్చాయి. వారందర్నీ మోదీ తన కేబినెట్‌లోకి తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 7గురు కేబినెట్ నుంచి నిష్క్రమించనున్నారని వార్తలొచ్చాయి. కానీ ఇవన్నీ తప్పయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను విస్తరించారు. విస్తరించారు అనే పదం చిన్నదేమో. భారీ ప్రక్షాళన చేపట్టారన్నది సమంజసం. ఏకంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మంది కేబినెట్ మంత్రులు. 28 మంది సహాయ మంత్రులు. వీరందరితో కలిపి మంత్రుల సంఖ్య 78. ఇందులో 31 మంది కేబినెట్ హోదా ఉన్న మంత్రులు. అయితే ఏకంగా 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో సంచలన విషయం ఏమంటే… అత్యంత సీనియర్లైన హర్షవర్ధన్, హరిశంకర్ ప్రసాద్, జవదేకర్ లాంటి సీనియర్లు కూడా రాజీనామా చేయడం అందర్నీ నివ్వెర పరిచింది.
లెక్క లెక్కా కలుపుతూ… కేంద్ర మంత్రివర్గ కూర్పు దేశంలో సెకండ్ వేవ్ నానా బీభత్సమే చేసింది. అటు ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు రాజకీయాల మీదా పెను ప్రభావమే చూపింది. సెకండ్ వేవ్‌ను తట్టుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షాలు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా కోడై కూసింది. పైగా ఎన్నికలు తరముతున్నాయి. ముఖ్యంగా యూపీ ఎన్నికలు. యూపీ ఓ మినీ ఇండియా. వివిధ రాష్ట్రాల ఎన్నికలు, చురుకుదనం, అనుభవం, నైపుణ్యం, వయస్సు, రాజకీయ ప్రయోజనాలు, విధేయత ఇవన్నీ కలగలిపి, ఒక్కో ఒక్కో పాచికను రాజకీయ యవనికపై వేశారు. దీంతో నిపుణులు, రాజకీయ అనుభవం కలగలిపి కేబినెట్ కూర్పును మోదీ చేశారు. యూపీ నుంచి 9 మంది, గుజరాత్ నుంచి 5 గురు, మహారాష్ట్ర, బెంగాల్, కర్నాటక నుంచి చెరో నలుగురికి కేబినెట్‌లో చోటు దక్కింది. రాబోయే పంజాబ్ ఎన్నికలను కూడా లెక్కలోకి తీసుకున్నారు మోదీ. విమానయాన మంత్రిగా సహాయ హోదాలో పనిచేస్తున్న హర్దీప్ పూరీని మోదీ కేబినెట్‌లోకి తీసుకున్నారు. అత్యంత ప్రాధాన్యమైన పెట్రోలియం మంత్రిత్వ శాఖను కేటాయించారు. రాబోయే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు ఓ కెబినెట్ బెర్త్‌ను కేటాయించారు. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. సాంస్కృతిక, పర్యాటక శాఖను కేటాయించారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణపై పట్టు సాధించాలని బీజేపీ అధిష్ఠానం ప్లాన్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బెంగాల్ విషయంలోనూ మోదీ శ్రద్ధ వహించారు. ఏకంగా నలుగురిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన నిశిత్ ప్రామాణిక్ (35) ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీని ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, బెంగాల్‌పై మోదీ కన్నేశారు.