ఇంటర్నెట్ పలు దేశాల్లో దాడికి గురవుతోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను తీసుకొచ్చిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు ఇంటర్నెట్ విచ్చిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. సమాచార ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చాలా దేశాలు ఆంక్షలు విధించాయన్నారు. వచ్చే పాతికేండ్లలో కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో సాధించే ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. బలమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలు కలిగిన దేశాలు ఇంటర్నెట్ విచ్చిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని కోరారు. తాను అమెరికా పౌరుణ్ని కానీ తనలో భారతీయ మూలాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయి. భారతీయ ఆత్మ నాలో ఉంది అని సుందర్ పిచాయ్ అన్నారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్ విలువలు, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా స్పష్టంగా తమకు తెలుసునని, అందుకోసం తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.