అమెరికాలోని తెలుగువారందరినీ ఒక్కటి చేసిన దశాబ్దాల చరిత్ర కలిగిన తానా సంస్థకు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందరో మహానుభావుల సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన స్థానాన్ని పొందిన అత్యున్నతమైన తానా వంటి సంస్థ కు అధ్యక్షుడు కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంతటి మహోన్నతమైన తానా సారధ్య బాధ్యతలను నా భుజ స్కందాలపై ఉంచిన తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్త టీమ్ అంతా కలిసి “తానా” ప్రతిష్ట మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని మాట ఇస్తున్నాను. కుల, మత, ప్రాంత, వర్గ వైషమ్యాలు లేని ఒక గొప్ప వేదికగా రానున్న రెండేళ్ళలో తానా ఖ్యాతి ఇనుమడింపజేసే ఎన్నో వినూత్న కార్యక్రమలకు శ్రీకారం చుట్టబోతున్నాము. తానా చేసే కార్యక్రమాలు ప్రపంచ నలుమూలలా ఉండే తెలుగుప్రజలందరికి చేరేలా, తానా సభ్యుల సంఖ్య మరింత పెరిగేలా , తానా సంస్థ బలోపేతానికి మరియు తానా కీర్తిప్రతిష్టలు దశ దిశలా విస్తరించేలా కృషి చేస్తాము. నేను, మా కార్యవర్గ సభ్యులందరమూ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.
తెలుగువాడి గుండె చప్పుడుగా ఉన్న తానా TEAM SQUARE ని తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా ఆపన్న హస్తం అందించటంతో పాటు అమెరికా మారుమూల ప్రాంతాలకి కూడా TEAM SQUARE సేవా కార్యక్రమాలు మరింత చేరువగా తీసుకువెళ్ళేలా కృషి చేస్తాం. తెలుగు ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం ఎన్నో వినూత్నమైన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి దృఢ సంకల్పంతో ఉన్నాము. అమెరికాలోని తెలుగు వారికి విపత్తులు, అవాంతరాలు ఎదురైనప్పుడు త్వతరగతిన ఏర్పాట్లు చేసి ఆదుకునేలా అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం మరింత మందిని తానాలో భాగస్వామ్యం చేసేలా మెరుగైన కృషి చేయబోతున్నాం అని మా కార్యవర్గం తరఫున ఘంటాపథంగా చెప్తున్నాను. క్రొత్తవారిని TANA లో మరింత చురుకుగా పనిచేయటానికి ప్రోత్సహిస్తాము. దీని ద్వారా అమెరికా, కెనడా లో ఉన్న ప్రతి చిన్న నగరాలలో TANA సేవలు విస్తృతం చేయడానికి నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా సేవలను అందించడానికి సమగ్ర విధానంతో ముందడుగు వేసేలా చేస్తుంది.
నేటి బాలలే రేపటి పౌరులన్న నిజాన్ని గౌరవిస్తూ యువతరానికి పెద్దపీట వేస్తూ వారి వికాసానికి, విజ్ఞానానికి మెరుగులు దిద్దే దిశగా అడుగులు వేయబోతున్నాం. వ్యక్తిత్వ వికాసమే సమాజాభివృద్ధికి పరమావధి. అందుకే పిల్లల్లో, యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా తానా కృషి చేస్తుంది అని మాట ఇస్తున్నాను. భాష, విద్య, వైద్య, వైజ్ఞానిక, ఉద్యోగావసరాలు, క్రీడలు, మనసిక వికాసం ప్రధాన అంశాలుగా పాటిస్తూ గత రెండు దశాబ్దాల నా అమెరికా అనుభవాన్ని ఉపయోగించుకుంటూ తానా ని మరింత మందికి చేరువ చేస్తూ, అనుభవజ్ఞుల సలహాలు అమలు చేస్తూ తానా ఖ్యాతి నాలుగు కాలాలపాటు నిలిచిపోయే మంచి పనులు చేయడమే మా లక్ష్యం.
TANA ఫౌండేషన్ ద్వారా TANA 5K RUNS, TANA scholarships, TANA హెల్త్ క్యాంప్స్ (Eye Camps, Cancer Screening Camps), అనాథ సేవా కార్యక్రమాలు, వారధి, గ్రంధాలయాల అభివృద్ది, TANA DGITAL CLASS ROOMS నిర్మాణం వంటి ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు TANA ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా అందిస్తామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము.
TANA CARES విభాగం ద్వారా TANA CURIE, TANA BACKPACK, బోన్ మారో డ్రైవ్స్, బ్లడ్ డ్రైవ్స్, ఫుడ్ అండ్ టాయ్ డ్రైవ్స్, విల్ సెమినార్లు, ట్రైనింగ్ వర్కుషాప్స్, టాక్స్ సెమినార్లు, కాలేజీ ప్లానింగ్ సెమినార్లు, ఫైనాన్సియల్ ప్లానింగ్ సెమినార్లు, వెబినార్లు , CPR కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరిన్ని సేవా కార్యక్రమాలు అందించటానికి మా శక్తివంచన లేకుండా కృషిచేస్తాం.
TANA ఆధ్వర్యంలో రైతుల కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నది మా ఆలోచన. SAT, ACT కోచింగ్ లతో పాటుగా సమ్మర్ క్యాంప్ లు, బాలోత్సవాలు నిర్వహిస్తాము. తానా మిషన్ స్టేట్ మెంట్స్ కు అనుగుణంగా తెలుగు సాహిత్య కార్యక్రమాలను ప్రపంచ నలుమూలలా తీసుకు వెళ్ళటం, ప్రపంచ సాహిత్య వేదిక, ప్రపంచ సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమం చేపట్టటానికి కృషి చేస్తాము. ప్రాచీన కళలకు, తెలుగు భాషకు సేవలు చేస్తున్న మహామహులను గౌరవిస్తూ వారిని తగురీతిలో ప్రోత్సహిస్తూ, గౌరవ సత్కారాలు అందజేస్తాము. సొగసైన అజంతా భాష తెలుగుని నేటి తరాల పిల్లలకు మరింత చేరువ చేసేలా, వారికి భాషా సౌందర్యం అవగతమయ్యేలా ప్రణాళికలు వేస్తాము.
కొత్తగా తానా మెడికల్ ఫోరమ్, TANA Membership Benefit Program,ఇమ్మిగ్రేషన్ ఫోరమ్ ఏర్పాటుతో పాటుగా యువతకు అవసరమైన మార్గదర్శకం చేరువ చేస్తాము. యువత, మహిళల అభ్యున్యతి కోసం వివిధ కార్యక్రమాలు విస్తృత పరుస్తూ వారి పాత్రను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తాము. మహిళా సాధికారత పెంచేందుకు సెమినార్లు, వెబినార్లు నిర్వహించి వారి అభివృద్ధిలో విశిష్ట పాత్ర పోషించడానికి ప్రయత్నం చేస్తాము. అమెరికాలో ఉన్న తెలుగు యువతకు మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటుగా వారి భవిష్యత్తుకు అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు అందుకు అవసరమైన యూత్ ఫెస్టివల్స్, సెమినార్స్ ను విస్తృత స్థాయిలో నిర్వహించాలని సంకల్పించాము.
TANA ఎగ్జిక్యూటివ్ కమిటీ, BOD మరియు ఫౌండేషన్ యొక్క ఆలోచనలను అందరి సమన్వయంతో అందించటానికి, మా కార్యవర్గ సభ్యులతో, ఇతర సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదిస్తాము. గడిచిన ఏళ్లలో తానా సమర్థవంతమైన ఎన్నో రకాల సేవలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందించింది. గ్రామ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనపరిచే పేద విద్యార్థులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం అందించి తద్వారా వారికి బంగారు భవిష్యత్తు కల్పించేందుకు తోడ్పడతాము. తానా విజన్ ను, లక్ష్యాన్ని చేరడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళతాము. తెలుగు మాట్లాడే ప్రజల వారసత్వాన్ని ఉత్తర అమెరికా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషిచేస్తాము. అదేవిధంగా, తానా, అమెరికాలోని అన్ని తెలుగు సంఘాలతో కలిసి ఒక కుటుంబంలా పనిచేయటానికి మేమందరం కృషిచేస్తాము.
ఈ జట్టులో నేను ప్రధాన సభ్యుడిని మాత్రమే. మా జట్టు అభివృద్ధి సాధకుల, నిష్కల్మష మనస్కుల, అవిశ్రాంత శ్రామికుల మేటి కలబోత. సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే మేలిమి హృదయమున్న కార్యవర్గం నా సొంతం అని గర్వంగా చెప్పగలను. నా ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నా వెన్నంటే ఉంటారని ఆశిస్తున్నాను.
సదా మీ సేవలో అంజయ్య చౌదరి లావు….