అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడిరచింది. ఎంఆర్‌ఓ ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారని, ధ్రువ పత్రం తప్పని తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.