విశాఖను రాజధాని చేయడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ సంద్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ కేవలం 20 గ్రామాల కోసమే రాజధాని ఉండాలా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారితో చర్చించే అంశం ఏమీ లేదన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు చేసి తీరుతామన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాయని మండిపడ్డారు. విశాఖ కేపిటల్‌ను వ్యతిరేకించిన వారెవరికీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ కూడా నిరసన వ్యక్తం చేస్తోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామని చెప్పారు. గతంలో మోదీ కేబినెట్‌లో ఉన్న అశోక్ గజపతిరాజుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తెలియదా అని ప్రశ్నించారు.