ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎల్2 ఎంపురాన్. బ్లాక్‌బస్టర్ చిత్రం లూసిఫర్ కు సీక్వెల్ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖురేషి అబ్రమ్ పాత్రలో ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఖురేషి పాత్రను పరిచయం చేయడంతో లూసిఫర్ మొదటి భాగం ముగుస్తుంది. స్టీఫెన్ నెడుంపల్లి అనే వ్యక్తి ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడు? అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనే అంశాలను ఈ రెండో భాగంలో ఆవిష్కరించబోతున్నామని, ప్రస్తుతం తిరువనంతపురంలో చిత్రీకరణ జరుపుతున్నామని, యుఎస్, యూకేలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది.
2025లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దీపక్ దేవ్, నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్, రచన-దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్.