అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత మారుమ్రోగింది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కి జై, జై తెలుగు తల్లి నినాదాలు మిన్ను ముట్టాయి … ‘తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) న్యూయార్క్’ వారి ఆహ్వానం మేరకు విశిష్ట అతిథి గా హాజరై (31.8. 2024)జ్యోతి ప్రకాశనం చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి సందేశం అందిస్తూ గీతా శ్లోకాలను గానం చేశారు. భగవద్గీతను ఈ దేశపు వాసులు కూడా గౌరవించారని చెబుతూ – న్యూ జెర్సీ లోని ‘శాటన్ హాల్ యూనివర్సిటీ’ లో MBA విద్యార్థులకు A JOURNEY OF TRANSFORMATION పేరుతో భగవద్గీతను పాఠ్యాంశం గా పెట్టడం, Apple కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన మరణానంతరం తన భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చిన వారికి భగవద్గీత పంచిపెట్టమని తనవారికి చెప్పడం తనను కదిలించిన విషయాలని గంగాధర శాస్త్రి అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/ff27ec1a-89d8-4d2b-b542-b6d1f283d607.jpeg)
ఈ సందర్భం గా గీత లోని ‘యద్యదాచరతిశ్రేష్ఠః ‘ శ్లోకం తాత్పర్యం తో సహా గానం చేసి -ఇతరులకు స్ఫూర్తిని చ్చే స్థాయిలో ప్రతి ఒక్కడూ ఉత్తముడుగా ఎదగాలని ప్రపంచం లోని మానవులందరికీ సందేశం అందించే గీత మతాలకు అతీతమైన కర్తవ్య బోధ గా గుర్తించాలని గంగాధర శాస్త్రి అన్నారు. ఇది అమెరికాలోని తెలుగుసాంస్కృతిక సంఘాల చరిత్ర లోనే ఈ కార్యక్రమం అత్యంత అరుదైన ఘట్టమని, TIME SQUARE కూడలిలో తెలుగు కార్యక్రమానికి వేదిక లభించడం మరపురానిదని గంగాధర శాస్త్రి అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/23d21485-a3ac-44d1-9357-3675e2d9bd3b.jpeg)
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-10.jpg)
“దేవనాగర భాష, భారత దేశానికి మాతృ భాష అయిన సంస్కృతాన్ని అంతే స్పష్టం గా ఉచ్ఛరించగలిగే వాడు తెలుగు వాడొక్కడే… భారత దేశం లో పుట్టినందుకు కృష్ణ గీత, తెలుగు వాడిగా పుట్టినందుకు పోతన పద్యం మీ పిల్లలకు నేర్పించి మన ఉనికిని చాటుకోండి… కూటి కోసం బయట ఇంగ్లిష్ మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం మాతృభాష లోనే సంభాషించండి. కేవలం సాంస్కృతిక ప్రదర్శనల కే తెలుగుని పరిమితం చేయకండి. మీ పిల్లలకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పించండి. తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు వాడే మెచ్చుకుంటే అది గొప్పవిషయం కాకపోవచ్చు. కానీ కన్నడ సుష్పష్టం గా తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు సైతం తన ‘ఆముక్తమాల్యద’ గ్రంథం లో ‘దేశభాషలందు తెలుగు లెస్స…’ అని తెలుగు భాషను కీర్తించడం గొప్పవిషయo ..” అని చెబుతూ గంగాధర శాస్త్రి తెలుగదేలయన్న పద్యం గానం చేశారు. తనను ఆహ్వానించిన TLCA అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్, ‘పద్మశ్రీ’ పురస్కృత డాII నోరి దత్తాత్రేయుడు, శ్రీ ఉదయ్ దొమ్మరాజు, శ్రీ సుమంత్ రామ్, డాII పూర్ణ ప్రసాద్ అట్లూరి, శ్రీ నెహ్రు, ఆల్బని తెలుగు సంఘం’ అధ్యక్షులు శ్రీ వెంకట్ జాస్తి తదితరులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/1e441e4f-2251-4c7b-a9fe-5282ef07404e.jpeg)
పిన్నలు, పెద్దలు ఆంధ్ర, తెలంగాణ కు చెందిన వివిధ కళా రూపాలతో ప్రదర్శించిన నృత్యాలను అభినందిస్తూ, భారత దేశం నుండి తీసుకు రావలసిన అవసరం లేనంత గా స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. మాతృదేశానికి దూరమైనా మాతృ సంస్కృతి ని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భం గా TLCA సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రిని సత్కరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-8.jpg)