వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్‌ల ప్రభంజనంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. ఈ పరిణామాలు ఇండియన్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలు ఉన్నవారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ ధోరణితోపాటు కఠినమైన వీసా నిబంధనలను ప్రవేశపెట్టడం, దరఖాస్తు ధరను విపరీతంగా పెంచేయడం వల్ల అమెరికాలోని భారతీయ వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం గల కార్మికులకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది.
ఇటీవల దాదాపు 438 టెక్ కంపెనీలు సుమారు 1,37,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. దీంతో ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని నిలిచే కోట అని టెక్ రంగంపై గతంలో ఉన్న భావం చెదిరిపోతున్నది. ఉద్యోగాల కొరత వల్ల హెచ్-1బీ వీసాదారులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. వీరు నిర్దిష్ట సమయంలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోగలగాలి లేదంటే, అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది.