ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో చేర్చేందుకు ఇండియాకు ఆ అర్హత ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సోచిలో జరిగిన వాల్దాయి డిస్కషన్ క్లబ్ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. భారత్‌తో అన్ని రంగాల్లోనూ సంబంధాలను రష్యా పెంచుకుంటోందని, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నమ్మకం పెరిగిందన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో ఇండియాను జోడించాలని, దీంట్లో డౌట్ లేదన్నారు. 140 కోట్ల జనాభాతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతోందన్నారు. భారత్ గొప్ప దేశమని పుతిన్ తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఇండియా లీడింగ్‌లో ఉందన్నారు. భారత్, రష్యా మధ్య సెక్యూర్టీ, రక్షణ రంగాల్లో సంబంధాలు బలపడినట్లు చెప్పారు. భారత సైన్యం వద్ద రష్యా సైనిక ఆయుధాలు చాలా ఉన్నాయని, తమ మధ్య నమ్మకమైన బంధం పెరిగిందన్నారు. భారత్‌కు ఆయుధాలు అమ్మడమే కాదు, వాటిని మేం డిజైన్ కూడా చేస్తామని ఆయన అన్నారు. బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.