పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్టు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ ప్రకటించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ నెలలోనే ఈ అంశంపై చట్టం చేయనున్నట్టు వెల్లడించారు. 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకే అప్పగించను న్నామని, ఈ బాధ్యత తల్లిదండ్రులు, పిల్లలది కాదని ఆయన స్పష్టం చేశారు. వయో పరిమితికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.