అల్లరి నరేశ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం బచ్చల మల్లి. సుబ్బు మంగాదేవి దర్శకుడు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో అల్లరి నరేశ్ మాట్లాడుతూ సింగిల్ సిట్టింగ్‌తో ఓకే అయిన స్క్రిప్ట్ ఇది. కామెడీ తప్ప అన్ని వేరియేషన్సూ నా పాత్రలో ఉంటాయి. నాంది తర్వాత డిఫరెంట్ సినిమాలు చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో దొరికిన కథ ఇది అని అన్నారు. గమ్యం లో గాలిశీను ఎలా గుర్తుండిపోయాడో, బచ్చల మల్లి కూడా అలా పదేళ్లపాటు గర్తుండిపోతాడని, ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పారు.
బచ్చల మల్లి అనేది నిజజీవిత పాత్ర. తను ఇప్పటికీ ఉన్నాడు. ఊళ్లో గొడవలన్నీ తన గొడవలుగా ఫీలై, అందరితో మాటలు పడుతూ, దెబ్బలు తింటూ తిరిగే మనిషి తను. అతని జీవితంలోని మూడు సంఘటనలను తీసుకొని వాటి ఆధారంగా ఓ కొత్త సబ్జెక్ట్‌ని తయారు చేశారు సుబ్బు. మూర్ఖత్వంతో తీసుకునే తొందరపాటు నిర్ణయాల పర్యవసానం ఎలా ఉంటుందో ఇందులో చూపించాం. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది. ఇందులో చక్కని మెసేజ్ కూడా ఉంది అని పేర్కొన్నారు. 1995 నుంచి 2005 వరకూ పదేళ్ల వ్యవధిలో జరిగిన కథ ఇదని, ఇందులో ట్రాక్టర్ డ్రైవర్‌గా కనిపిస్తానని, కావేరీ అనే అమ్మాయి బచ్చలమల్లి జీవితంలోకి ప్రవేశించాక అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని, సుబ్బు దర్శకత్వం, విశాల్ శేఖర్ సంగీతం, రిచర్డ్ ఎం.నాథన్ కెమెరా పనితనం, రాజేష్ దండా నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన బలాలని అల్లరి నరేశ్ చెప్పారు.