అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్ విజయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో తన గెలుపునకు దోహదపడ్డ మస్క్‌కు ట్రంప్ తన క్యాబినెట్ లో సముచిత స్థానం కల్పించారు. ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక ట్రంప్ 2.0లో మస్క్ పాత్ర కీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతాడా ? అంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ నేతలు ప్రెసిడెంట్ మస్క్ అంటూ ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాకు మస్క్ అధ్యక్షుడు అవుతా డంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్యానించారు.ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన అమెరికాలో పుట్టలేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యం లో జన్మించిన పౌరుడై ఉండాలి. కానీ, మస్క్, దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.