అగ్రరాజ్యం అమెరికాకు, కెనడా , మెక్సికో దేశాలతో సుంకాల యుద్ధం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంపై కెనడా, మెక్సికో దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మెక్సికో కూడా అలాంటి ఆదేశాలే జారీ చేసింది.
155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నామని, ట్రంప్ చర్యలకు ఇది ప్రతిస్పందన అని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం ఈ మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని, మిగిలిన టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమలవుతాయని చెప్పారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్ అనుకుంటే తమతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలని, అదే వారికి మంచిదని పేర్కొన్నారు.