అమెరికా వీసాలు రెన్యువల్ చేసుకోవడానికి ఇక ఎదురుచూపులు మరింత పెరగనున్నాయి. హెచ్-1బీ, బీ1, బీ2 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను వ్యక్తిగత ఇంటర్వ్యూ అవసరం లేకుండా రెన్యువల్ చేసే డ్రాప్బాక్స్ విధానం అర్హతను అమెరికా మార్చింది. 12 నెలల్లోపు గడువు ముగిసిన వీసాలను అదే క్యాటగిరీలో రెన్యువల్ చేయించుకునే అవకాశం డ్రాప్బాక్స్ ద్వారా ఉండేది. అయితే, కొవిడ్ సమయంలో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ కావడంతో 12 నెలల పరిమితిని 48 నెలలకు పెంచారు. దీంతో హెచ్-1బీ, బీ1(వ్యాపార), బీ2(పర్యాటక), ఎల్-1 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిసి నాలుగేండ్లు అయినా అమెరికా కాన్సులేట్లలో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన అవసరం లేకుండానే డ్రాప్బాక్స్ ద్వారా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది.
ఇప్పుడు ఈ విధానాన్ని మరోసారి మార్చి, కొవిడ్కు ముందు ఉన్నట్టుగానే 12 నెలలకు కుదించారు. దీంతో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిసి 12 నెలలు దాటిన వారు వీసాలు రెన్యువల్ చేసుకోవడానికి మళ్లీ యూఎస్ కాన్సులేట్లలో ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. వీసాల రెన్యువల్ మరింత ఆలస్యం కానుంది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమలులోకి వచ్చింది.
