
తాను మొదటి పర్యాయం అధికారంలో ఉన్నపుడు పలుమార్లు సమావేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్‌లోని తన కార్యాలయంలో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటెతో సమావేశమైన ట్రంప్‌ను ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌తో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకుంటారా అని విలేకరులు ప్రశ్నించారు. తనకు కిమ్‌తో మంచి సంబంధాలు ఉండేవని, చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ట్రంప్ వారికి బదులిచ్చారు. జనవరి 20న రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఉత్తర కొరియాను అణు శక్తిగా ట్రంప్ అభివర్ణించారు. మొదటి పర్యాయం అధికారంలో ఉన్నపుడు చేపట్టలేకపోయిన అణు నిరాయుధీకరణ ప్రయత్నాలకు బదులుగా ఇప్పుడు ఆయుధాల తగ్గింపుపై కిమ్‌తో చర్చలు జరగాల్సి ఉందన్నారు.
