Skip to main content

Namaste NRI

లంబకోణాలు నేర్పిన వాళ్లే … కుంభకోణాలు చేస్తుంటే ఎలా? : ఆర్‌.నారాయణమూర్తి

నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి న‌టిస్తున్న చిత్రం   యూనివర్సిటీ. పేపర్‌ లీక్‌ అనేది ట్యాగ్‌లైన్‌. స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నారాయణమూర్తి నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విద్యారంగంలో జరుగుతున్న పేపర్‌ లీక్‌ల వల్ల జరిగే నష్టాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించామని తెలిపారు. గ్రూప్‌ 1, 2 పరీక్షల్లో ప్రశ్నాపత్రాల్ని లీకులు చేయడం చూస్తుంటే,  విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు ఏమైపోతాయో అని భయం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లంబకోణాలు నేర్పిన వాళ్లే ఇలా కుంభకోణాలు చేస్తూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిలా కొట్టుకుని నేలకు రాలుతున్నాయి అన్నారు.

ఆటంబాంబులు, సునామీల కంటే పేపర్‌ లీకేజీలు సమాజానికి, వ్యవస్థకు ఎక్కువ హానిచేస్తానని, కాపీయింగ్‌ చేసి మార్కులు తెచ్చుకున్న వాళ్లు డాక్టర్లు అయితే రోగుల ప్రాణాలకు భరోసా ఉండదని, అలాంటి వాళ్లు ఇంజనీర్లు అయితే బ్రిడ్జిలు ఎలా నిలబడతాయని ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు జరగకూడదంటే పేపర్ల లీకేజీలను అరికట్టాలని, విద్యను జాతీయం చేసి ప్రైవేట్‌ మాఫియా నుంచి విముక్తి చేయాలని ఆయన కోరారు.

ఈ  చిత్రంలో  వై.ఎస్‌.కృష్ణేశ్వర్‌రావు, తిరుపతి నాయుడు తదితరులు నటిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌, ప్రముఖ కవి నందిని సిధారెడ్డితో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి పాటలు: గద్దర్‌, జలదంకి సుధాకర్‌, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్‌.నారాయణమూర్తి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events