Skip to main content

Namaste NRI

నైటా నూతన అధ్యక్షుడిగా రవీందర్

ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరంలో స్థిరపడిన తెలుగు, తెలంగాణ ప్రవాసుల సంస్కృతి, సామాజిక ఐక్యతకు కృషి చేస్తున్న న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంది. 2026 సంవత్సరానికి గాను సంస్థ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్‌కు నాయకత్వం వహించనున్నారు.

అమెరికాలో వేల సంఖ్యలో ఉన్న తెలుగు, తెలంగాణ ఎన్.ఆర్.ఐలు తమ ప్రాంతీయ సంస్కృతిని కాపాడుకుంటూ, ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం నైటాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరుసార్లు ఏర్పాటైన కార్యవర్గాలు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాయి. నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ గతంలో తాను నైటాలో సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వంటి హోదాల్లో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కొత్త కార్యవర్గ సభ్యుల సహకారంతో సంస్థ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని, రానున్న ఏడాదిలో మరింత విస్తృతమైన సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే చదివారు. ఆ తర్వాత హనుమకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్‌ రెడ్డీస్‌ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్‌ న్యూయార్క్‌ ( మెడికల్‌ స్కూల్‌) తో పాటు సౌత్‌ వెస్ట్రర్న్‌ మెడికల్‌ సెంటర్‌ ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్‌ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.

ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్‌ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్‌ రాజ్‌ కుమార్‌, ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events