దీపావళి పండుగను అమెరికా లోనూ సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిరచారు. దీపావళి డే యాక్ట్ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకోవడం విశేషమని తెలిపారు. మహమ్మారి కొవిడ్ 19పై పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలోనూ ఈ పండగకు ప్రాధాన్యముందని పేర్కొన్నారు. దీపావళిని ఫెడరల్ ప్రభుత్వం సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని మలోనే కోరారు.
భారతీయుల అమెరికన్ రాజా కృష్ణమూర్తి సహా పలువురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ గ్రెగరీ మీక్స్ తదితరులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రపంచానికి, ప్రజల జీవితాలకు వెలుగులు ప్రసాదించే దీపావళి పండగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించడం ఎంతో సముచితంగా ఉంటుందని రాజా కృష్ణమూర్తి అన్నారు.