శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.


సంస్థ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్ తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017 లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీ కి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజా కి ధన్యవాదాలు తెలియజేశారు.


ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించాలని రత్నకుమార్ తో చెప్పగానే అతి తక్కువ సమయంలో ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినందుకు అభినందించారు. ‘శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తకం అందుబాటులో లేకపోవడంతో పుస్తక రచయిత, సీనియర్ డైరెక్టర్ వంశీ ని సంప్రదించి దీనిని పునర్ముద్రణ చేయించామని చెప్పారు. తమ తండ్రి కె. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమం అంతటా ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.


ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన సంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.


కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.

కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తి తదితరులు సహకారం అందించారు. కార్యక్రమానికి సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు తమ సహాయ సహకారాలను అందించారు.















