Namaste NRI

ఆంక్షలు సడలింపు .. 60 రోజులపాటు అనుమతి : అమెరికా

ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలికే తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఇరాన్‌ చమురుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ఆర్థిక శాఖ 60 రోజులపాటు చెల్లుబాటు అయ్యే లైసెన్సును జారీ చేసింది. ఈ అనుమతి ఇరాన్‌ చమురు ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలకు వీలు కల్పిస్తుంది. ఇది ఆగస్టు 21 వరకు అమల్లో ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌ ఉన్నతాధికారులతో తాను జరిపిన సుదీర్ఘ చర్చలు విజయవంతమైన తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చెప్పిన నేపథ్యంలో ఈ ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఈ లైసెన్సును పునరుద్ధరించకపోతే అది ఆగస్టు 21న గడువు ముగిసే అవకాశం ఉంది. గత వారం అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ చర్య చేపట్టారు.

దీనికి ప్రతిఫలంగా ఇరాన్‌ హొర్ముజ్‌ జలసంధిని తెరుస్తుంది. అంతేగాక ప్రాథమిక ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరిస్తుందో లేదో పరిశీలించడానికి ఐఏఈఏ అణు పరిశీలకులను ఇరాన్‌ అనుమతిస్తుంది. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలకు అనుగుణంగా, హొర్ముజ్‌ జలసంధి గుండా స్వేచ్ఛా, బహిరంగ రవాణాను అనుమతించడానికి, అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పరిశీలకులను తమ దేశంలోకి అనుమతించడానికి ఇరాన్‌ అంగీకరించింది అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ పేర్కొన్నారు. అయితే క్యూబా, ఉత్తర కొరియా, ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతానికి చమురును విక్రయించడానికి ఈ అనుమతి (లైసెన్సు) అవకాశం కల్పించదు.

Social Share Spread Message

Latest News