భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 19 అడుగుల విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. అమెరికా రాజధానికి సమీపంలోని మేరీల్యాండ్ సబర్బ్ ప్రాంతంలో 13 ఎకరాల విస్తీర్ణంలో, వైట్‌హౌస్‌కు 22 మైళ్ల దూరంలోని అకోకిక్ టౌన్‌షిప్‌లో దీన్ని ఏర్పాటుచేశారు. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ నిర్మించిన ఈ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం ను కూడా ఈయనే రూపొందించారు. భారత్ వెలుపల ఇంత పొడవైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమంలో జై భీమ్ నినాదాలు మార్మోగాయి. భారీ వర్షం కురుస్తున్నా అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికిపైగా భారతీయ అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.