అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియ ఇకపై మరింత ఖరీదు కాబోతున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్1బీ సహా వివిధ రకాల వీసా దరఖాస్తుల రుసుముల్ని పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు, నిధుల కొరతను ఎదుర్కొనేందుకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) వీసా దరఖాస్తుల రుసుముల్ని భారీగా పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే దీనిపై వివిధ రకాల సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
2016 నుంచి అమలవుతున్న ప్రస్తుత ఫీ రూల్‌ను యూఎస్‌సీఐఎస్ మార్చాలనుకుంటున్నది. హెచ్1బీ ఈ-రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు, హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుము 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచాలని కొత్త ఫీ రూల్ లో యూఎస్‌సీఐఎస్ ప్రతిపాదించింది. దీని ప్రకారం, సిటిజన్‌షిప్ (న్యూట్రలైజేషన్) దరఖాస్తు ఫీజు 640 డాలర్ల నుంచి 760 డాలర్లకు, అత్యంత ప్రాచుర్యం పొందిన ఈబీ-5 (గ్రీన్‌కార్డ్ ప్రోగ్రాం) రుసుములు 11,160 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది.