
అమెరికా వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతోపాటు తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్(డీహెచ్‌ఎస్) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది. గ్రీన్ కార్డులు, పౌరసత్వం, ఇతర ప్రయోజనాలు కోరుతూ దరఖాస్తు చేసుకునే భారతీయులు సహా ఏటా 35 లక్షల మందికిపైగా విదేశీయుల నుంచి ఈ సమాచారాన్ని కోరనున్నట్టు డీహెచ్‌ఎస్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 14161 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో భాగంగా ఈ ప్రతిపాదన ఉంది.

కొత్త నిబంధన మేరకు దరఖాస్తుదారులు తొమ్మిది ప్రధాన ఇమ్మిగ్రేషన్ ఫారాలలో తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు అందచేయవలసి ఉంటుంది. పాస్‌వర్డ్ తెలియచేయవలసిన అవసరం లేదు. ఈ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపును తనిఖీ చేసేందుకు, జాతీయ భద్రతా ముప్పులను అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు.

భారతీయ ఇమ్మిగ్రెంట్లు ముఖ్యంగా స్టెమ్ ప్రొఫెషనల్స్, హెచ్-1బీ ఆశావహులు, ఈబీ-5 పెట్టుబడిదారులకు ఈ కొత్త నిబంధనతో నిఘా మరింత అధికమవుతుంది. సాధారణ ఆన్‌లైన్ సంభాషణలు కూడా సమీక్షకు గురవుతాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంటుందని, పోస్టులు, కామెంట్లు, చాటింగ్‌లపై సమీక్ష ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు.
