Namaste NRI

తెలుగు అసోసియేషన్ ఆఫ్ యూఏఈ ఆధ్వర్యంలో దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలుగు అసోసియేషన్‌ యూఏఈ ( యూఏఈ ప్రభుత్వముచే గుర్తింపబడిన తెలుగు అసోసియేషన్‌ ) వారు బతుకమ్మ సంబరాలను అక్టోబర్‌ 15వ తేదీన దుబాయిలోని షబాబ్‌ అల్‌ అహ్లి దుబాయి క్లబ్‌ నందు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి  ప్రతిబింబిస్తూ, అందమైన పూలతో సుందరంగా బతుకమ్మలను సిద్దం చేసుకుని, సంప్రదాయ వస్త్రధారణలతో విచ్చేసిన తెలుగు ఆడపడుచులతో, వారి కుటుంబసభ్యులతో సంబరాలు నిర్వహించిన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి తెలుగు అసోషియేషన్‌ తెలంగాణ సామాజిక సేవా విభాగ డైరెక్టర్‌ శ్రీ వుట్నూరి రవి గారు ప్రధాన నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు.

తెలుగు అసోసియేషన్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీ మసిఉద్దీన్‌ గారి స్వాగతోపన్యాసముతో లాంచనముగా బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తూ, తెలుగు అసోసియేషన్‌ కొరకు శాశ్వత కార్యాలయము ఏర్పాటు చేసుకోవలసిన ఆవశ్యకత, ఆ దిశలో చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. తన్మయి ఆర్ట్‌ స్టూడియో వారి శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యములతో బతుకమ్మ సంబరాలకు శోభాయమానముగా శుభారంభము జరిగింది.

యూఏఈలో మొట్టమొదటి సారిగా 9 అడుగుల భారీ బతుకమ్మను తెలుగు అసోసియేషన్‌ వారు ఎంతో అందముగా అలంకరించి, సంబరాలకు కేంద్ర బిందువుగా నిర్వహించటముతో పాటుగా, యూఏఈలో బతుకమ్మ సంబరాలను తారాస్థాయిలో అత్యంత ఘనంగా ప్రారంభించారు. వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో బంధుమిత్రులతో, కార్యక్రమ నిర్వాహకులతో కలిసి ఈ మధుర క్షణాలను తమ తమ కెమేరాలలో చిత్రీకరించి, మధుర జ్ఞాపకాల జాబితాలలో పదిలపరుచుకున్నారు.

ప్రముఖ తెలంగాణ జానపద గాయకి కుమారి మధు ప్రియ గారు, గాయకుడు శ్రీ అష్ట గంగాధర్‌ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినారు. వారిరువురు ఆలపించిన జాన పద గీతాలు, బతుకమ్మ నేపధ్య గీతాలు ప్రతి ఆడపడచుని, ప్రతి ఒక్క చిన్నారిని రెండు గంటలకు పైగా బతుకమ్మ ఆటాడిరచేలా ఉత్సాహంతో ఉర్రూతలూగించాయి. కుమారి స్రవంతి, శ్రీ మల్లేష్‌ కార్యక్రమానికి సంధాన కర్తలుగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు.

60 కి పైగా బతుకమ్మలతో, 1300 మందికి పైగా విచ్చేసిన తెలుగు వారితో సంబరాలు తెలంగాణ వాతావరణాన్ని బతుకమ్మ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్రతిబింబించింది.  విచ్చేసిన బతుకమ్మలన్నిటిలో అత్యంత సుందరముగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు, సాంప్రదాయ వస్త్రధారణలో అత్యంత ఆకర్షణీయముగా అలకరించుకున్న ఆడపడచులకు, ఇంకా మరెన్నో విభాగాలలో పాల్గొని అందరినీ అలరించిన ఆహూతులను ఎంపిక చేసి, విజేతలందరికి కార్యక్రమ స్పాన్సర్ల చేతుల మీదుగా బహుమతుల ప్రధానము జరిగినది.

ఈ కార్యక్రమాన్ని ఆరియల్‌ కల్సల్టింగ్‌ వారు ప్రధాన సమర్పకులుగా, ట్రాన్స్‌ ఏషియా వారు ప్లాటినం సమర్పకులుగా, ఎన్‌ ఆర్‌ ఆర్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడిరగ్‌ వారు గోల్డ్‌ సమర్పకులుగా, మలబార్‌ గోల్డ్‌ డైమండ్స్‌ వారు గోల్డ్‌ సమర్పకులుగా వ్యవహరించి తమ పూర్తి సహకారమందించారు. లులు ఎక్చేంజ్‌, మహన్వి డాక్యుమెంట్స్‌ క్లియరింగ్‌, హాక్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, సాయి, మై దుబాయి, ఎస్‌ క్యూబ్‌ కౌంటీ, అల్టాఫీక్‌ ట్రావెల్‌, స్పియర్‌ టెక్నాలజీస్‌, తన్మయ్‌ ఆర్ట్‌ స్టూడియో, జువెల్‌, మాగ్నం క్లినిక్‌, కెలైడోస్కోప్‌ ప్రాపర్టీస్‌, త లెమన్‌ స్టూడియో వారు సమర్పకులుగా వ్యవహరించి కార్యక్రమం విజయవంతముగా నిర్వహించటానికి సహకరించారు.

టీవీ 9 వారు కార్యక్రమానికి లైవ్‌ కవరేజ్‌ ఇచ్చి ప్రదాన మీడియా సమర్పకులుగా ఎనలేని సహకారమందించారు. రేడియో ఖుషీ, మా గల్ఫ్‌, టీవీ 5 వారు మీడియా సమర్పకులుగా పూర్తి సమకరామందించారు.   తెలుగు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుస గారు,  కల్చరల్‌ డైరెక్టర్‌ వెంకట సురేష్‌ గారు, ఫైనాన్స్‌  డైరెక్టర్‌ మురళీ కృష్ణ నూకల గారు, కమ్యూనిటీ సర్వీసెస్‌ డైరెక్టర్‌ శ్రీ సాయి ప్రకాష్‌ సుంకు గారు, లీగల్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ దామర్ల గారు, వెల్ఫేర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాస్‌ యెండూరి గారు కార్యక్రమానికి విచ్చేశారు.

 తెలుగు అసోసియేషన్‌ వర్కింగ్‌ కమిటీ నుంచి శ్రీమతి లత గారు, సౌజన్య గారు , విమల గారు, ఉష గారు, విజయ్‌ భాస్కర్‌ గారు, భీం శంకర్‌ గారు, ఫహీం గారు, శరత్‌ చంద్ర గారు, చైతన్య గారు, శివ గారు, మోహన్‌ కృష్ణ గారు కార్యక్రమము విజయవంతము కావించటములో కీలక సహాయ సహకారములందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress