కాంగ్రెస్‌లో తెలంగాణ జనసమితి (టిజెఎస్) పార్టీని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. అయితే, జేఏసీగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసింది మాత్రం వాస్తమని వెల్లడిరచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న జగన్‌ను షర్మిల ఆపగలరా? అని ప్రశ్నించారు.
పొడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు పనులు చేయించుకొన్న నర్సులను ఇప్పటికిప్పుడు తొలగించడం దారణమన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.