భారత యువతకు బైడెన్ సర్కారు తీపికబురు చెప్పింది. అమెరికాలోని కంపెనీలు సులభంగా విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలుకల్పిస్తూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దీనితోపాటు ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. దీంతో లక్షల మంది భారత టెక్ ప్రొఫెషనల్స్‌కు లబ్ధి చేకూరనున్నది. వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) క్యాటగిరీలోకి వచ్చే హెచ్-1బీ వీసా సాయంతో అమెరికాలోని టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా భారీగా లబ్ధి పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలోని కంపెనీలు సులభంగా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలుకల్పిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) కొత్త నిబంధనలను ప్రకటించింది. తద్వారా హెచ్-1బీ వీసాల వార్షిక చట్టబద్ధ పరిమితి నుంచి మినహాయింపు పొందిన నాన్‌ప్రాఫిట్, ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనాలు, నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో అమెరికన్ సంస్థలు తమ వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుని ప్రపంచ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు వీలవుతుంది. కొత్త విధానం లో లేబర్ కండీషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి.