తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి మొదలవుతుంది. భాగ్యలక్ష్మి ఆమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలిరోజు కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ నుంచి డోలు వాయిద్యాలు, డప్పు నృత్యాలు, అశ్వదళాల ప్రదర్శన, యుద్ధ సైనికుల అలంకారాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు 36 రోజులపాటు పాదయాత్ర సాగనుంది.