భారతీయ యువతలో అత్యధికులు ఉన్నత విద్య అటుపై కొలువుల కోసం అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు వెళుతున్నారు. భారత్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని విదేశాల్లో పీజీ, రీసెర్చ్ కోర్సులు చదువడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు బ్రిటన్ వంటి కొన్ని దేశాలు విద్యార్థులతోపాటు వారి డిపెండెంట్లకు వీసా కల్పించాయి. కానీ, ఇక ముందు బ్రిటన్‌కు డిపెండెంట్ వీసాపై విద్యార్థుల తల్లిదండ్రులు గానీ, జీవిత భాగస్వాములు గానీ, పిల్లలు గానీ వెళ్లడానికి కుదరదు. రోజురోజుకు విదేశీ విద్యార్థుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకున్నది. 2024 జనవరి నుంచి నాన్ రీసెర్చి కోర్సుల్లో పీజీ చేయడానికి వచ్చే విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను తీసుకురావడానికి అనుమతి నిరాకరిస్తూ బ్రిటన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.