ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు తమ ఆర్థిక సంసిద్ధతను పెంచుకొనేలా డిపాజిట్‌ను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 10 వేల డాలర్లు ఉండగా, 20,635 డాలర్లకు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నాం. విద్యార్థుల వసతి కల్పనకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం. తమ నిర్ణయం ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి విద్యార్థులను రక్షిస్తుంది అని కెనడా విదేశాంగ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.