నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరికపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుండబద్దలు కొట్టారు. రష్యా సైనిక చర్య కొనసాగుతున్నా నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడానికి సులభతరమైన మార్గాల్లేవని తేల్చి చెప్పారు. నాటో కూటమిలో చేరడానికి అవసరమైన ప్రమాణాలు పాటించాల్సిందేనని అన్నారు. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ కోసం తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయబోమని పేర్కొన్నారు. నాటో కూటమిలో చేరాలని భావించే దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండాలి. ఉక్రెయిన్, జార్జియా భవిష్యత్‌లో తమ సభ్య దేశాలవుతాయని నాటో ప్రకటించింది.. కానీ పాలన, పారదర్శకతతో నాటో ప్రమాణాలను అందుకోవడంలో ఉక్రెయిన్ విఫలమైంది. దీనికి తోడు అవినీతి, బలహీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం వల్లే ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం రాలేదు. అయితే, రష్యా సైనిక చర్య నుంచి కాపాడటానికి మాత్రమే ఉక్రెయిన్‌కు నాటో సాయం చేస్తున్నది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటి సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాతోపాటు 12 దేశాలు కలిగి ఏర్పాటు చేసిన కూటమే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో). దాన్ని విస్తరించడంతో 30 దేశాలకు సభ్యత్వం లభించింది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత తూర్పు యూరప్ దేశాలు సభ్యత్వం పొందాయి. వీటిలో కొన్ని రష్యాతో సరిహద్దులు కలిగి ఉన్నాయి.

