శివపదం గ్లోబల్ ఫ్యామిలీ, భారత శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడానికి, ఏకత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, కళలకు సరిహద్దులు లేవని చూపించడానికి ఇండోనేషియా బాలి వచ్చారు. వాణి గుండ్లాపల్లి ( నో యువర్ రూట్స్, యూఎస్ఏ), దినేష్ కుమార్ (సంగమం అకాడమీ, ఇండియా) నేతృత్వంలో, ఋషిపీఠం వారి సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నృత్యప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
యూఎస్‌ఏ లో పుట్టి పెరిగిన 45 మంది యువ నర్తకీ, నర్తకులు, గురువులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించి వాటి గొప్పతనాన్ని చాటిచెప్పారు. బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం సాహిత్య పద్యాలతో పాటు త్యాగరాజు, అన్నమయ్య, మైసూర్ వాసుదేవాచార్యులు రచించిన సాహిత్యాలకు నృత్య ప్రదర్శన చేశారు.
శివాష్టకం, దుర్గా దేవి స్తోత్రం వంటి వేద స్తోత్రాలను అనేక నృత్య కళారూపాలలో ప్రదర్శించారు. చంద్రశేఖర సరస్వతి స్వామి ప్రపంచానికి శాంతి, శ్రేయస్సు తీసుకురావడానికి రచించిన మైత్రీమ్ భజత అనే గీతాన్ని నృత్య రూపంతో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి బాలిలోని ఐసీసీఆర్, ఎస్.వీ.సీ,సీ డైరెక్టర్ వీన్ మేఘ్వాల్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. రెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాయన్ అద్న్యానా ఇసి, డెన్‌పాసర్, గౌరవ అతిథులుగా వైస్ రెక్టార్, డాక్టర్ ఏ. ఏ. గేడే రాయ్ రేమావా, వైస్ రెక్టార్లు , డాక్టర్ ఐ కేటుట్ ముకా, ప్రొఫెసర్ డాక్టర్ కొమంగ్ పాల్గొని కళాకారులను అభినందించారు.
ఉబుద్‌లోని సరస్వతి ఆలయం, డెన్‌పసర్‌లోని ఇండోనేషియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన ప్రదర్శనలు నిర్వహించామని నిర్వాహుకులు వెల్లడించారు. కళలకు ఎల్లలు లేవని చాటిచెప్పడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.