గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసింది. తమ చెరలో ఉన్న ముగ్గురు బందీలు యైర్ హార్న్, సాగుయ్ డెకెల్ చెన్, అలెగ్జాండర్లను రెడ్క్రాస్కు అప్పగించింది. వీరిని విడుదల చేసినందుకు గానూ ఇజ్రాయెల్ సైతం 369 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టింది. కాగా గాజాలో దాదాపు 15 నెలల పాటు యుద్ధం కొనసాగిన అనంతరం జనవరి 19 నుంచి హమాస్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ ప్రతి శనివారం తన వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత శనివారం కూడా బందీల విడుదల ఉంటుందని అంతా ఆశించారు. బందీల కుటుంబసభ్యులు కూడా వారి కోసం ఎదురుచూశారు. అయితే హమాస్ బందీలను విడుదల చేయలేదు. పైగా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెలీ బందీలను వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా విడిచిపెట్టాలని ఈనెల 11న హెచ్చరించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికలతో దిగొచ్చిన హమాస్ బందీల విడుదలకు అంగీకరించింది.
