తమ ఉత్పత్తులపై భారత్ ఎలా సుంకాలను విధిస్తే, తామూ అలానే ప్రతీకార సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందే ఆయన ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అమెరికా పర్యటనలో భాగంగా వైట్హౌజ్లో ట్రంప్తో మోదీ సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై చర్చించిన తర్వాత ఇరువురూ ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇండియా మా ఉత్పత్తులపై ఎలా సుంకాలు విధిస్తే, మేమూ అలానే విధిస్తాం.భారత్తో పరస్పర సుంకాలు ఉంటాయి అని పేర్కొన్నారు.
కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా అన్యాయం, ఎక్కువగా ఉన్నాయని అన్నారు. భారత్కు అతిపెద్ద చమురు, గ్యాస్ సరఫరాదారుగా అమెరికా మారగలిగే ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నట్టు ప్రకటించారు. భారత్తో వాణిజ్య లోటును తగ్గించడంలో ఇది భాగమని చెప్పారు. ఈ ఏడాది నుంచి భారత్కు ఆయుధ విక్రయాలు కొన్ని బిలియన్ డాలర్లు పెరిగుతాయని, ఎఫ్-35 ఫైటర్ జెట్లను సైతం భారత్కు సరఫరా చేస్తామని ప్రకటించారు.
