ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నారైల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై రవి వేమూరి స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తోపాటు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలకు ఈ సందర్భంగా డాక్టర్ రవి వేమూరి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రవి వేమూరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారా లు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కూటమి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం గత అయిదేళ్లుగా ఎన్నారైలు పడిన కష్టం ఏ మాత్రం వృధా కాలేదన్నారు. కూటమి గెలుపు, ఎన్నారైల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంలో ఎన్నారైల పాత్ర మరవలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ఘన విజయం సాధించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా ఘనంగా వేడుకలు జరుపుకున్నారన్నారు.
కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎన్నారై నేతలు రాధాకృష్ణ రవి, బుచ్చి రాంప్రసాద్, సాగర్ దొడ్డపనేని, డీవీ రావు, మల్లిక్ మేదరమెట్ల, శేషుబాబు, రాజశేఖర్ చప్పిడికి ఆయన ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా కూటమి గెలుపు కోసం కష్టపడిన ప్రతీ ఎన్నారైనకు ఆయన కృతజ్జతలు చెప్పారు.