అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన భావోద్వేగ ప్రేమకావ్యం తండేల్. చందూ మొండేటి దర్శకత్వం. బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య మాట్లాడారు. ఈ సినిమా చేశాక, నెక్ట్స్ సినిమా ఈ టీమ్ లేకుండా ఎలా చేయాలి అని భయమేసింది. అంతబాగా చూసుకున్నారు నన్ను. తండేల్ రాజుగా నేను మారడంలో ఈ టీమ్ కృషి చాలా ఉంది. శ్రీకాకుళం వెళ్లి ఈ కథకు ప్రేరణనిచ్చిన వ్యక్తుల్ని కలుసుకొని, వారినుంచి ఎన్నో విషయాలు తెలుసుకొని కష్టపడి, ఇష్టంతో ఈ సినిమా చేశాం. చందుతో నా మూడో సినిమా ఇది. నేనంటే తనకు ప్రత్యేకమైన అభిమానం. అది టేకింగ్‌లో కనిపిస్తూవుంటుంది. సాయిపల్లవితో కలిసి పనిచేయడానికి ఆర్టిస్టులందరూ ఉవ్విళ్లూరతారు. అంతగొప్ప కోస్టార్ తను. అద్భుతమైన టీమ్ పనిచేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.
అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ ట్రైలర్, టీజర్ ఏది చూసినా అద్భుతం అనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైతూ, సాయిపల్లవి కెమిస్ట్రీ సూపర్. పాతికేళ్ల నుంచి నంబర్‌వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు దేవిశ్రీ. ఇప్పటికీ ఆయనలో కసి తగ్గలేదు. అక్కినేని ఫ్యాన్స్‌కి ఫుల్‌మీల్ లాంటి సినిమా ఇది అన్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన అనుభవమని, అరవింద్ తనను సొంత కూతురులా చూసుకున్నారని, చైతూ గొప్ప కోస్టార్ అని సాయిపల్లవి చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, దిల్‌రాజు, చందూ మొండేటి, దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు బన్నీవాసు, విద్య, ఎడిటర్ నవీన్ నూలి, రైటర్ కార్తిక్, వంశీ నందిపాటి. ఎస్‌కేఎన్, నటి కల్పలత, భానుప్రసాద్, రియాచౌదరి తదితరులు మాట్లాడారు.