75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని గల్ఫ్ దేశాల్లోని భారతీయులు ఈసారి విభిన్నంగా జరుపుకొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా జాతీయగీతం జనగణమన ఆలపించి, దాన్ని రికార్డు చేసి, ప్రభుత్వ పోర్టల్ రాష్ట్రగాన్.ఇన్‌లో ఆప్‌లోడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి భారతీయుడు జాతీయగీతాన్ని ఆలపించి అప్‌లోడ్ చేయాలని ప్రధాని పిలుపు మేరకు విదేశాల్లోని భారతీయులు ఒక యజ్ఞంగా భావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలానికి చెందిన బాబ్జి స్టిఫెన్ డానియల్, సుభాషిణి దంపతుల తొమ్మిదేళ్ల కుమార్తె మరియా రాచెల్ ఆలపించిన జాతీయ గీతం ప్రవాసీయుల్లో చక్కర్లు కొడుతోంది.
దుబాయిలో పుట్టి పెరిగిన రాచెల్ ఇక్కడి ఇండియన్ హైస్కూల్‌లో నాలుగవ తరగతి చదువుతోంది. ఈసారి అత్యధిక మంది భారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రప్రథమంగా రికార్డు చేయగా, దాన్ని విదేశాల్లోని అసంఖ్యాకులు అనుసరించారు.