ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు (పీబీఎస్‌ఏ) ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ అయిన మురళీధర్ మిర్యాలకు లభించింది. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో ఇండియన్ అంబాసిడర్ సంజయ్ కుమార్ వర్మ నుంచి మురళీధర్ మిర్యాల అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును తీసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నదని మురళీధర్ మిర్యాల చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తాను సాధించిన లెక్కలేనన్ని విజయాలకు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను, గౌరవాన్ని ఇనుమడిరపజేయడంలో తన కృషికి గుర్తింపుగా తనకు పీబీఎస్ అవార్డు దక్కిందని తెలిపారు.
మురళీధర్ మిర్యాల ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు ( పీబీఎస్‌ఏ) తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా గతంలో కూడా ఆయన ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్నారు. అప్పుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ పీబీఎస్‌ఏ ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.