Namaste NRI

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇకలేరు

 భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌(92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ ప్రకటించింది.

1932 సెప్టెంబర్‌ 26న ప్రస్తుత పాకిస్థాన్‌లోని గాహ్‌ ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన్మోహన్‌ సింగ్‌ కుటుంబం భారత్‌కు వచ్చి మొదట హల్దానీలో, ఆ తర్వాత అమృత్‌సర్‌లో స్థిరపడింది. మన్మోహన్‌ చిన్న వయసులోనే ఆయన తల్లి మృతి చెందడంతో నానమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్‌ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో డిగ్రీ, 1954లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 1962లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ అందుకున్నారు. తర్వాత భారత్‌కు తిరిగొచ్చి తను చదివిన పంజాబ్‌ యూనివర్సిటీ లోనే ఎకనమిక్స్‌ సీనియర్‌ లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లోనూ ఆయన కొంతకాలం ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు సలహా దారుగా వ్యవహరించారు. 1972 నుంచి 1976 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1985 నుంచి 1987 వరకు ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా ఆయన ఎదిగారు.

1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహారావు,  మన్మోహన్‌ సింగ్‌కు అనూహ్యంగా తన క్యాబినెట్‌లో చోటు కల్పించి ఆర్థికమంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టే కీలక బాధ్యతను అప్పగించారు.  1991లో మొదటిసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్‌ సింగ్‌ 2019 వరకు కొనసాగారు. 2019లో రాజస్థాన్‌కు మారి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1998 నుంచి 2004 వరకు వాజ్‌పేయీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మన్మోహన్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించినా అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్‌ సింగ్‌కు దక్కింది. 2004 మే 22న మొదటిసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేండ్ల తన పాలనకు ప్రజామోదాన్ని పొంది 2009లో మరోసారి ప్రధాని అయ్యారు. పదేండ్ల పాటు ప్రధానిగా కొనసాగి, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పని చేసిన నాలుగో వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ప్రధానిగా పని చేసినప్పుడు ఆయనను మౌనమునిగా ప్రతిపక్షాలు విమర్శించేవి. అయితే, ఆయన మౌనంగా ఉంటూనే దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలో ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ చేపట్టారు. 2008లో వామపక్షాలు వ్యతిరేకించినా, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా అమెరికాలో పౌర అణు ఒప్పందాన్ని చేసుకున్నారు. మన్మోహన్‌ ప్రభుత్వంలో దేశంలో జరిగిన మార్పులను గుర్తించిన ప్రజలు 2009లో మరోసారి యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. 2009 మే 22న మన్మోహన్‌ సింగ్‌ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

మన్మోహన్‌ సింగ్‌ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డుకు తెచ్చిన ఘనత మన్మోహన్‌దే. సరళతర ఆర్థిక విధానాల రూపకర్తగా, దేశ ఆర్థికవ్యవస్థకు కొత్తదిశను చూపిన మార్గదర్శిగా ఆయన నిలిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress