అమెరికాలో పనిచేస్తున్న భారత నిపుణులకు అగ్రరాజ్యం గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సులభతరం చేసేలా జో బైడెన్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా గడువు ముగిసిన విదేశీయులు రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే రెన్యువల్ చేసే పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆ దేశ వీసా సర్వీస్ డిఫ్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జులీ స్టఫ్ తెలిపారు. హెచ్ 1బీ వీసాదారులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. మొదటి దఫాలో 20 వేల వీసాలను రెన్యువల్ చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంతో అత్యధికంగా భారతీయులే లాభపడనున్నారు. అమెరికా వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలంటే ఇప్పటివరకు స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణ సమయం, ఖర్చులను దృష్టిలోపెట్టుకొని వీసాదారుల కష్టాలను తొలగించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు జులీ పేర్కొన్నారు.
