అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీగఢ్ కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివారం రాత్రి అమృత్సర్ కు చేరుకుంది. విమానంలో తమ చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి నేరస్థుల్లా తీసుకువచ్చారని, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని దల్జీత్ సింగ్ అనే ప్రయాణికుడు విమానంలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించాడు. పంజాబ్ లోని హోషియార్పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్ సింగ్ తాను ఏజెంట్ చేతిలో మోసపోయినట్టు చెప్పాడు. శనివారం రాత్రి 11.35 గంటలకు సి-17 విమానం విమానాశ్రయం చేరుకోగా ఇమిగ్రేషన్, వివరాల సేకరణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు పంజాబ్ కు చెందిన డిపోర్టీలను పోలీసు వాహనాలలో పంపించారు.
