దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన చిత్రం లక్కీభాస్కర్. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ లక్కీ భాస్కర్ ఓ కొత్త ప్రయత్నం. వెంకీ చూడ్డానికి చిన్నాకుర్రాడిలా ఉంటాడు. కానీ తను రాసిన సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. మీనాక్షి చౌదరి అద్భుతమైన పాత్ర చేసింది. తనతో నటించిన సన్నివేశాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇదొక సగటు మనిషి జీవితం. అందరికీ నచ్చుతుంది అని అన్నారు.
అతిథుల్లో ఒకరైన దేవరకొండ విజయ్ మాట్లాడుతూ యాక్టర్ అవ్వకముందు దుల్కర్ సినిమాలు చూస్తూ ఉండేవాడ్ని. దుల్కర్‌తో మహానటి, కల్కి సినిమాలు చేశా. కానీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. త్వరలో ఆ కోరిక తీరుతుందనుకుంటున్నా. లక్కీభాస్కర్ పెద్ద హిట్ అవ్వాలి అని ఆకాంక్షించారు. మరో అతిథి త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. వెంకీ ఈ కథను డిజైన్ చేసిన తీరు వండర్. ఇందులోని ప్రతి పాత్రా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక దుల్కర్ వేరే లెవల్. ఇప్పటివరకూ చూసిన దుల్కర్ వేరు. ఇందులోని దుల్కర్ వేరు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, రాంకీ, మానసా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.