ముందు హెచ్చుతగ్గులులేకుండా ఈ భూమి అందరికీ నివాస యోగ్య గ్రహం కావాల్సి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతోన్న జి 20 ఫైనాన్స్ ట్రాక్ ( ఆర్థిక మంత్రులు, ప్రధాన బ్యాంకుల గవర్నర్ల ) సమావేశం నేపథ్యంలో బంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన అనేది కేవలం నినాదప్రాయం కారాదని, దీనితో పాటు పలు సవాళ్లు కూడుకుని ఉన్నాయని తెలిపారు. పర్యావరణ మార్పులు, మహమ్మారిలు, ఆహార అభద్రత, బలహీనతల వంటి పలు అంశాలను సవాళ్లుగా తీసుకోవల్సి ఉందన్నారు. ఇవన్నీ మిళితం అయ్యి ఉంటాయని, వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించుకుంటేనే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. ప్రపంచబ్యాంక్ తన ముందు ఉన్న నిర్ధేశిత లక్షాలను మరింతగా విస్తృతపర్చుకోవల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కేవలం పేదరిక నిర్మూలన ఒక్కటే లక్షంగా ఉంది.దీనిని మించి మనం ఈ ప్రపంచాన్ని పేదరిక నిర్మూలన దశ నుంచి దాటించడమే కాకుండా , ఇది నివాస యోగ్యం కావాల్సి ఉందన్నారు.
